యాంటీబాడీలు మరియు టీకాలు. ఇవేమిటి?

వ్యాధి కలిగించే సూక్ష్మక్రిములు (pathogens), ఉదాహరణకు వైరస్లు, మన శరీరంలోకి ప్రవేశించి, మన కణాలపై దాడిచేసి, వాటి సంఖ్యను పెంచుకుంటాయి. వీటికి వ్యతిరేకంగా మన రోగనిరోధక వ్యవస్థలో (immune system) ముఖ్యంగా రెండురకాల కణాలు  పనిచేస్తాయి. ఇవి టి-కణాలు మరియు బి-కణాలు. టి-కణాలు వైరస్లు కలిగియున్న కణాలను గుర్తించి నాశంచేయగా, బి-కణాలు యాంటీబాడీలను (antibodies) తయారుచేస్తాయి. యాంటీబాడీలు వైరస్లతో బంధమై వైరస్లు మన కణాలలోకి ప్రవేశించకుండా ఆపుతాయి. ఈ విధంగా వైరస్ నిర్మూలనలో తోడ్పడిన టి మరియు బి కణాలను మన శరీరం ప్రత్యేకంగా నిల్వ ఉంచుకుంటుంది. వీటిని మెమొరీ కణాలు (memory cells) అంటారు. మరోమారు వైరస్లు దాడిచేస్తే ఈ కణాలు వాటిని వెంటనే గుర్తించి నాశంచేయగలవు. వ్యాధి కలగదు. 

టీకాలు (vaccines) పనిచేసే తీరు ఒక ముఖ్యమైన తేడా మినహా ఇలాగే ఉంటుంది. అదేమంటే, టీకాలలో వైరస్లను పోలియున్న కొన్ని కణాలుంటాయి. ఇవి వ్యాధిని కలిగించలేవు, ఐతే వీటిద్వారా నిజమైన వైరస్లను నాశంచేసే మెమొరీ కణాల ఉత్పత్తి జరుగుతుంది.

కోవిడ్-19 వ్యాధిని కలిగించే కరోనావైరస్ మన శరీరంలో ఉన్నప్పుడు యాంటీబాడీల ఉత్పత్తి జరుగుతుంది. శాస్త్రవేత్తల పరిశీలనల ప్రకారం, వ్యాధి నయమైన వారిలో కొన్ని రోజుల తరువాత యాంటీబాడీల సంఖ్య తగ్గుతూవస్తోంది. ఈ విషయం కొందరిలో ఆందోళన కలిగిస్తోంది: రేపు టీకా కనుగొన్న తరువాత కూడా కరోనావైరస్కు వ్యతిరేకంగా వ్యాధినిరోధక శక్తి ఇలాగే కొన్నిరోజులపాటే ఉంటుందేమోనని. కానీ ఇది ఒక సహజమైన పరిణామమేననీ, వైరస్ / టీకాలోని కణాలకు వ్యతిరేకంగా పనిచేసే మెమొరీ కణాలు మన రక్తంలో ఎన్నోయేళ్ళపాటు పదిలంగా ఉంటాయనీ యేల్ విశ్వవిద్యాలయంలోని (అమెరికా) శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొన్నిమార్లు వైరస్ కంటే టీకాలద్వారా పొందిన వ్యాధినిరోధక శక్తి బలమైనదని కూడా చెబుతున్నారు. 

టీకాలను తీసుకుంటే మనకు వ్యాధి సోకదు. అంతేగాక, మనద్వారా ఇతరులకు కూడా సోకదు. అధికశాతం ప్రజలు టీకాలను తీసుకుంటే, కొన్ని కారణాల వల్ల (ఉదా: అనారోగ్యం, బలహీనమైన రోగనిరోధక శక్తి) వాటిని తీసుకోలేని వాళ్లకు కూడా రక్షణ లభిస్తుంది. దీన్నే హర్డ్ ఇమ్యూనిటీ (herd immunity) అంటారు. ఇది చాలా విలువైనది, భవిష్యత్తులో కోవిడ్ తిరిగిరాకుండా చూడగలదు. ఈ విధంగా వైరస్ను పూర్తిగా నిర్మూలించడం సాధ్యమే.

ప్రపంచవ్యాప్తంగా నేడు 165కు పైగా టీకాలకు క్లినికల్ ట్రయల్స్ (clinical trials) జరుగుతున్నాయి. రానున్న 3-4 నెలలలో వీటి ఫలితాలు మనముందుంటాయి. ఇవి విజయవంతమవ్వాలనీ, అందరికీ టీకాలు లభ్యమవ్వాలనీ కోరుకుందాం! 

మరిన్ని వివరాల కోసం ఈ వ్యాసాన్ని చదవండి: https://www.nytimes.com/2020/07/31/opinion/coronavirus-antibodies-immunity.html

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s